వైసీపీ ప్రభుత్వం కేవలం భూ దందాల కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ సర్కారు తలపెట్టిన ఈ రాజధానుల ప్రతిపాదనకు ప్రదాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ఆమోదం ఉందనే ప్రచారం అబద్ధం అని..ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ధృవీకరించారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు గురువారం ఉదయం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం అయ్యారు.
జనసేన నేతలతో పాటు బిజెపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, సునీల్ ధియోదర్ కూడా ఉన్నారు. నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని జనసేనాని హామీ ఇచ్చారు. వైసీపీ అవాస్తవ ప్రచారాన్ని జనసేన, బీజేపీ అధికార ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.