జగన్..కెసీఆర్ ల మధ్య మళ్ళీ ‘గోదావరి చర్చలు’

Update: 2020-01-14 03:57 GMT

తొలి రోజుల్లో స్నేహగీతాలు ఆలపించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కొంత కాలం మౌనంగా ఉండిపోయారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏపీలో ఆర్టీసీ విలీనానాని సంబంధించి కెసీఆర్ జగన్ సర్కారుపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అది అయ్యేదా..చచ్చేదా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. కానీ ఏపీలో ఆర్టీసీలో విలీనం అయిపోయింది. అది వేరే అంశం. సడన్ గా మళ్లీ ఇద్దరు సీఎంలు హైదరాబాద్ లో భేటీ అయి మళ్ళీ గోదావరి జలాలపై చర్చలు ప్రారంభించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ఏపీ సొంతంగా బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీంతో ఉమ్మడిగా తలపెట్టే ప్రాజెక్టు అటకెక్కినట్లే అని ప్రచారం జరిగింది. కానీ సడన్ గా మళ్లీ ఇద్దరు సీఎంలు ఇదే అంశంపై చర్చలు ప్రారంభించటం వెనక కారణం ఏమై ఉంటుందా? అన్న చర్చ మొదలైంది. ఇద్దరు సీఎంల భేటీ అనంతరం ఓ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి...‘కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతి ఏడాది ఒకే రకంగా ఉండటం లేదు. చాలా సందర్భాల్లో కృష్ణా నది ద్వారా నీరు రావడం లేదు.

దీంతో ఈ నది ఆయకట్టు కింద ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు, తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. అందుకే పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నది నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య. దీంతో అటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, ఇటు పాలమూరు, నల్లగొండ జిల్లాల వ్యవసాయ భూములకు కచ్చితంగా నీరు అందుతుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజె క్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలా లను తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించుకోవాలి. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు’ అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణయం కుదిరింది.

గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్‌ ఎలా ఉండాలి? అనే దానిపై తదుపరి సమావే శంలో మరింత విస్తృతంగా చర్చించాలని వైఎస్‌ జగన్, కేసీఆర్‌ నిర్ణయించారు. ‘‘విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో అనవసర పంచాయితీ ఉంది. దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏమీ కాదు’’ అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం నుంచే ఇద్దరు సీఎంలు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో(సీఎస్‌లు) ఫోన్‌లో మాట్లాడారు. 9, 10వ షెడ్యూళ్లలోని సంస్థల విభజన అంశాలను పరిష్కరించుకునే దిశగా త్వరలోనే సమావేశం కావాలని సూచించారు.’ అని పేర్కొన్నారు.

 

 

Similar News