తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళలో ఐదుగురు ఎమ్మెల్యేలు మాట్లాడారని..చంద్రబాబు గంటకు పైగా ఉపన్యాసం ఇచ్చి కూడా ముఖ్యమంత్రి సమాధానం ఎవరూ వినకూడదని..అందరూ నిద్రపోయే వరకూ సీఎంకు మైక్ రాకూడదనే తీరుతో వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. కేవలం దుర్బుద్దితో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు పోవటంతో జగన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసి..మార్షల్స్ ను పిలిచి టీడీపీ సభ్యులను బయటకు పంపాలని ఆదేశించారు. దీంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టి ఒక రోజుకు వీరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు రాక్షసులు..దుర్మార్గులు, కీచకుల్లా వ్యవహరిస్తున్నారని..ప్రపంచంలో ఇలా చేసే వాళ్లు ఎవరూ ఉండరని జగన్ ధ్వజమెత్తారు.