టీడీఎల్పీ సమావేశానికి గంటా..వాసుపల్లి డుమ్మా

Update: 2020-01-19 09:51 GMT

ప్రతిపక్ష తెలుగుదేశంలో ‘రాజధాని’ వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార వైసీపీలో మాత్రం సాక్ష్యాత్తూ గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు రాజధాని మొత్తం అమరావతిలో కేంద్రీకృతం కావాల్సిన అవసరం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించటంతోపాటు..రోడ్డెక్కి ప్రదర్శనలు సైతం నిర్వహించారు. రాజకీయంగా ఇది తమకు ఎంతో కొంత నష్టం చేకూరుస్తుందనే విషయం తెలిసినా అధిష్టానాన్ని ధిక్కరించే పరిస్థితి లేకపోవటంతో పార్టీ ఏది చెపితే అది చేయాల్సిన పరిస్థితి ఆయా జిల్లాల ఎమ్మెల్యేల్లో ఉంది. ఇదిలా ఉంటే ఇఫ్పటికే రకరకాల కారణాలతో చిక్కులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష టీడీపీకి రాజధాని వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆదివారం నాడు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశానికి వైజాగ్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ లు డుమ్మా కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గంటా శ్రీనివాసరావు గత కొంత కాలంగా అసలు టీడీపీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కానీ అప్పడప్పుడు టీవీల ముందు ప్రత్యక్షమై తాను పార్టీ మారటంలేదని ప్రకటిస్తున్నారు తప్ప..పార్టీ లైన్ లోకి మాత్రం రావటం లేదు.

వైజాగ్ కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ జిల్లాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆహ్వానిస్తూ తీర్మానం కూడా చేశారు. టీడీఎల్పీ సమావేశానికి డుమ్మాకొట్టిన వైజాగ్ ఎమ్మెల్యేలు సోమవారం నాడు అసెంబ్లీకి అయినా వస్తారా..రారా?. వచ్చినా ఎలాంటి వైఖరి తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఇఫ్పటికే టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలకు కూడా విప్ జారీ చేసింది. రాజధాని విషయంలో అధికార వైసీపీ ఎలా వ్యవహరించనుంది..దీనికి తగినట్లు సభలో..బయటా ఎలా వ్యవహరించాలనే అంశంపై టీడీఎల్పీలో నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి డుమ్మా కొట్టినా వారంతా వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

Similar News