జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భాష మార్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్, చంద్రబాబే అన్నారు. వారి భాష బాగుంటే..తాము కూడా అలాగే ఉంటామన్నారు. ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే.. రాజధాని సాకుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీ కార్యకర్తలు కావాలనే ఒక ప్లాన్ ప్రకారం తన ఇంటిపై దాడి చేశారని ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తన ఇంటికి ధ్వంసం చేసేందుకు యత్నించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రంలో అశాంతి కలిగిస్తున్నారని మండిపడ్డారు.
జనసేన నాయకుడు నానాజీ రెచ్చగొట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు తన నివాసంపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. పవన్‌కు నానాజీ తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. నేతలను తప్పుదారి పట్టించే మనస్తత్వం నానాజీది అని.. అ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. ఈ దాడిపై పవన్ స్పందించిన తీరు సరికాదన్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ భాష మార్చుకోవాలని.. వారి భాష బాగుంటే తామంతా బాగుంటామని ద్వారంపూడి పేర్కొన్నారు.