అమరావతి భూ కుంభకోణం విషయంలో సర్కారు దూకుడుగా వెళుతోంది. ఓ వైపు శాసనసభలో తీర్మానం ద్వారా స్వతంత్ర సంస్థతో విచారణకు సిద్ధమైన సర్కారు..మరో వైపు అసైన్ మెంట్ భూముల కొనుగోలు వ్యవహారంలో కూడ కేసులు పెట్టడం ప్రారంభించింది. అందులో భాగంగా మాజీ మంత్రులు పి. నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు.
ఈ మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. మాజీ మంత్రులపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తించామని మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు.