ఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. తొలుత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీలో రాజధాని అంశంతోపాటు ఏ అంశంపై అయినా బిజెపి, జనసేనలు సంయుక్తంగానే ధర్నాలు, నిరసనలు చేపడతాయని ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని..ప్రతి 15 రోజులకు ఒక సారి ఈ కమిటీ సమావేశం అయి చర్చలు జరుపుతుందని తెలిపారు. సమన్వయ కమిటీలో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. తర్వాత జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఫిబ్రవరి రెండో తేదీన ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయని తెలిపారు.
అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం... ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ తెలిపారు. స్వలాభం పక్కన పెట్టి రెండు పార్టీలు పనిచేస్తాయన్నారు. ప్రభుత్వం రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తుందని తప్ప..ప్రజా ప్రయోజనాలపై ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదని విమర్శించారు. ఈ సమావేశం అనంతరం విలేకరులు బిజెపి-జనసేన విలీనం అంశంపై ప్రశ్న వేయటంతో పవన్ కళ్యాణ్ ఒకింత సీరియస్ అయ్యారు. మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారా?. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విలీనం అంశం ఎక్కడ ఉందని..తమ మధ్య పొత్తు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.