ఏపీలో రాజధాని మార్పు వ్యవహారంపై తుది నిర్ణయం తేలిపోయే ముహుర్తం దగ్గరపడుతోంది. దీనికి సంబంధించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి శుక్రవారం తన తుది నివేదిక సమర్పించింది. ఇఫ్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక అందింది. ఈ కమిటీల నివేదికలోని అంశాలను పరిశీలించి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ప్రభుత్వానికి తగు సిఫారసులు చేయనుంది. వీటి ఆధారంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవటం, అసెంబ్లీలో చర్చించటంతో దీనికి ముగింపు పలకనున్నారు. అయితే కోర్టులో రైతులు వేసిన పిటీషన్లు ఏ మలుపు తీసుకుంటాయన్నదే కీలకం కానుంది.
ఈ నెల 6న హైపవర్ కమిటీ భేటీ అయి చర్చించనుంది. 20 లోపు ప్రభుత్వానికి రిపోర్టు అందించనుంది. హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు కీలక సూచనలు చేసింది.