ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నాడు హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో ప్రతి వారం కోర్టుకు హాజరైన జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారిక విధుల కారణంగా ఎప్పటికప్పుడు మినహాయింపులు కోరుతూ వచ్చారు. కానీ గత వారం మాత్రం సీబీఐ కోర్టు తప్పనిసరిగా సీఎం జగన్ కోర్టు ముందుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన హోదాకు..కోర్టు విచారణకు సంబంధం లేదని పేర్కొంది.
దీంతో శుక్రవారం నాడు జగన్ తోపాటు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇతర అధికారులు విచారణకు వచ్చారు. జగన్ ఎదుర్కొంటున్నవి పాత కేసులే అయినా సీఎం హోదాలో జగన్ కోర్టుకు హాజరు కావటం రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ ఇఫ్పటికే జగన్ పై పలు విమర్శలు చేస్తోంది. ఈ పరిణామాన్ని ఆ పార్టీ మరింత దూకుడుగా వాడుకోవటం ఖాయంగా కన్పిస్తోంది.