శాసనసభ స్పీకర్ నేరుగా విచారణకు ఆదేశించవచ్చా?

Update: 2020-01-20 09:27 GMT

స్పీకర్ సభ కస్టోడియన్ మాత్రమే అంటున్న నిపుణులు

సభ తీర్మానం ద్వారానే విచారణ జరగాలంటున్న సీనియర్ నేతలు

స్పీకర్ విచారణ కోరటం..సీఎం ఒకే అనటంతో తెరపైకి కొత్త సంప్రదాయం

‘శాసనసభ స్పీకర్ సభ కస్టోడియన్ మాత్రమే. ఏ అంశంపై అయినా విచారణ కోరుతూ సభ మాత్రమే తీర్మానం చేయగలదు. అంతే కానీ స్పీకర్ నేరుగా ప్రభుత్వాన్ని ఓ అంశంపై విచారణ జరపాలని కోరలేరు’. ఇదీ శాసనసభా వ్యవహారాల నిపుణులు చెబుతున్న మాట. కానీ అందుకు భిన్నంగా సోమవారం నాడు అసెంబ్లీలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై శాసనసభా వ్యవహారాలు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమగ్ర వివరాలు సభ ముందు ఉంచారు. దీనిపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ అమరావతి భూముల వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకు, నిజాలు నిగ్గుతేల్చేందుకు పకడ్బందీగా సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. సభాపతి నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

శాసనసభకు ప్రత్యేక ఐడెంటిటీ ఉంటుందని, సభాపతికి క్వాసీ జ్యుడీషియల్‌ అధికారాలు ఉంటాయని, స్పీకర్‌ జడ్జితో సమానమని పేర్కొన్నారు. ఏదైన అంశంపై విచారణ చేపట్టాలని అడిగే అధికారం స్పీకర్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై వివాదం చోటు చేసుకుంది. అమరావతి భూకుంభకోణాలపై విచారణ జరపాలని స్పీకర్‌ కోరడంతో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ సభాపతిగా విచారణ కోరే అధికారం తనకుందని, హద్దుమీరి టీడీపీ సభ్యులు మాట్లాడరాదని, హద్దుల్లో ఉండాలని మందలించారు. విచారణ జరిపించాలని కోరితే మీకెందుకు అంత ఉలుకు? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు.

 

Similar News