రాజధాని రైతుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఇఫ్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో మిగిలిన పార్టీలు కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. సర్కారు మాత్రం రాజధాని తరలింపునకు సంబంధించి తన పనులు తాను చేసుకుంటూ వెళుతోంది. ఈ తరుణంలో పోలీసులు రాజధాని ఆందోళనలపై అణచివేతను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నిరసన కారులను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు. తాజాగా అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జెఏసీ) కార్యాలయాన్ని పోలీసులు మూసివేశారు. గురువారం రాత్రి కార్యాలయాన్ని మూసేసి..పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. అమరావతి పరిరక్షణ పేరుతో పలు సంఘాలు కలిసి జెఏసీని ఏర్పాటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. లాఠీచార్జ్ లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. పోలీసుల వలయాన్ని అడ్డుకుని ప్రజలు ముందుకు వెళ్తున్నారు. రాజధానిలో పోలీసుల తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా అని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు తమను శిక్షిస్తారా అని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దగ్గరకు వెళటానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలా? అని ప్రశ్నించారు.