అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి అమరావతిలో టీడీపీ నేతలు ముందస్తు సమాచారంతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసి అనుచిత లబ్ది పొందారని ఆరోపిస్తోంది. ఈ మేరకు పలు ఆధారాలను కూడా సభ ముందు ఉంచింది. ఇటీవల అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం వివరాలను సభ ముందు ఉంచగా..స్పీకర్ కూడా విచారణ జరిపించాలని కోరటం..అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే అనటం తెలిసిందే. ఈ తరుణంలో హోం మంత్రి సుచరిత సభలో తీర్మానాన్ని పెట్టారు. స్వతంత్ర ఏజెన్సీతో ఈ విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 4,070 ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. హోంమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.