గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు ప్రాంతాలకు తరలించటానికి నిర్ణయం తీసుకోవటంతో నెల రోజుల నుంచి ఇదే చర్చ తప్ప..మరో అంశం లేకుండా పోయింది. తాజాగా ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయటం..అసెంబ్లీలో ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించటంతో ప్రతిపాదనలు కాస్తా వాస్తవరూపం దాల్చినట్లు అయింది. అయితే మండలిలో ఈ ప్రతిపాదనకు తాత్కాలికంగా చెక్ పడినా ప్రభుత్వ నిర్ణయం అమలుకు ఇది పెద్ద అడ్డంకి కాబోదు. కాకపోతే కొంత జాప్యం జరుగుతుంది అంతే. అయితే ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నట్లు ముందుకెళుతుందే తప్ప..ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదు.
ఈ తరుణంలో రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ 37 మంది రైతులు హైకోటును ఆశ్రయించారు. వీళ్లు రాజధానుల వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్ డీఏ బిల్లును కూడా హైకోర్టులో సవాల్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం అని తమ దగ్గర భూములు తీసుకున్న ప్రభుత్వం ఇఫ్పుడు ఏకంగా సీఆర్ డీఏ రద్దు చేయటంతోపాటు వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. మరి ఈ వ్యవహారంలో హైకోర్టు ఏ మేరకు జోక్యం చేసుకుంటుంది..ఏమి ఆదేశాలు జారీ చేస్తుందో వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు నిరసనగా గుంటూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోబంద్ పాటిస్తున్నారు. రైతులు ఎప్పటిలాగానే తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.