ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తన కేసుల కోసమే ఢిల్లీకి వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో జగన్‌కు ఇది రెండో పరాభవమన్నారు. సిఎం ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్లినా తన సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరీ మినహాయింపుల గురించే అడుగుతున్నారని ఆరోపించారు. ఫెమా, మనీ లాండరింగ్‌పై సీబీఐ, ఈడి కేసుల్లో పీకల్లోతు జగన్ కూరుకుపోయారన్నారు.
శిక్షపడే సమయం దగ్గర పడిందని..ట్రయల్స్ వేగవంతం కావడంతో జగన్‌కు భయం పట్టుకుందని యనమల అన్నారు. సీఎం జగన్ ప్రతి శుక్రవారం ఏదో ఒక పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకేనని యనమల విమర్శించారు. మూడు శుక్రవారాలు ఏదో ఒక వంకతో కోర్టు హాజరుకు డుమ్మా కొట్టారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళారులే స్వైర విహారం చేస్తున్నారన్నారు. టీడీపీ సింగపూర్ తరహా నిర్మాణాలు చేపడితే, వైసీపీ స్మశాన వాటికలపై దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు.