యనమల అల్లుడిపై జగన్ సర్కారుకెందుకంత ప్రేమ?!

Update: 2019-12-15 05:40 GMT

ఖజానాకు 18 కోట్ల రూపాయల నష్టం చేకూర్చినా చర్యలు శూన్యం

రాజమార్గంలో వెళ్ళేందుకు అనుమతి

‘రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు దేవుడే జగన్ ను ఏపీ సీఎం చేశాడు’. ఇదీ అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు. అవినీతిని ఏ మాత్రం సహించేదిలేదని లేదని చెబుతున్న జగన్ సర్కారు ఎందుకు సర్కారు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చిన అధికారిని రాజమార్గంలో బయటకు పంపేసింది. ఒక అధికారి విషయంలో ఒకలా..మరో అధికారి విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. ఆ కథ ఏంటో మీరూ చూడండి. ఆంధ్ర్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సీఈవోగా ఉన్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను ఏపీ సర్కారు సస్పెండ్ చేసింది. ఆయన అక్రమాలకు ఆధారాలు ఉన్నందునే సస్పెండ్ చేశామని సర్కారు చెబుతోంది. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ మరో ఐఆర్ఎస్ అధికారి, యనమల రామకృష్ణ అల్లుడు గోపీనాథ్ సర్కారు ఖజానాకు దాదాపు 18 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లేందుకు కారణం అయ్యారని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నివేదిక ఇచ్చింది.

ఈ అక్రమాలు జరిగిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పూనం మాలకొండయ్య, ఏపీ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైఎస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గోపీనాథ్ లు ఉన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై సీఐడీ కేసు పెట్టేందుకు కూడా అనుమతించాలి కోరుతూ అక్టోబర్ 28న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఓ మెమో కూడా పెట్టారు. అసలు ప్రభుత్వంలో అవినీతిని సహించం..ఎంత పెద్దలు ఉన్నా వదిలి పెట్టం అని చెబుతున్న జగన్ సర్కారు గోపీనాథ్ ఇక నాకు డెప్యుటేషన్ చాలు పేరెంట్ డిపార్ట్ మెంట్ కు వెళతాను అని అడిగాడంట..సర్కారే సరే అంటూ ఆయన డిప్యూటేషన్ ను రద్దు చేస్తూ వెనక్కి వెళ్లటానికి వీలుగా జీవో 2825 జారీ చేసింది. మరి ఆయన జమానాలో జరిగిన అక్రమాల సంగతేంటి?. సాక్ష్యాత్తూ ఏసీబీ నివేదిక ఇఛ్చినా ఎందుకు అవినీతి అంటే అసలు సహించం అని చెప్పే సర్కారు గోపీనాథ్ విషయంలో మౌనంగా ఉంది. ఓ వైపు జాస్తి కృష్ణకిషోర్ పై సస్పెన్షన్ విధించిన సర్కారు మరో కేసులో రాజమార్గం వేయటం వెనక కారణాలు ఏమిటి?.

ఇందుకూరి వెంకటరామరాజు అనే వ్యక్తి హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాల మేరకు టీబీఎస్ టెలిమ్యాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అమలు చేసే సమయలో పాల్పడ్డ అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోనే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెడికల్ కార్పొరేషన్ ఎండీల నిర్లక్ష్యం వల్ల సర్కారుకు 18 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఇదొక్కటే కాదు..మెడికల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలో గోపీనాథ్ పై వచ్చినన్ని విమర్శలు అన్నీ ఇన్నీ కావు. తనకు కావాల్సిన కాంట్రాక్టర్ల కు అనుకూలంగా వ్యవహరించటం, నచ్చని వాళ్ళను వేధించటం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అంతే కాదు..ఆయన ఏపీలో ఉద్యోగం చేస్తూ ఓ ఖరీదైన కారును భార్య పేరుతో కొనుగోలు చేసి నల్లగొండలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది కూడా అప్పట్లో పెద్ద దుమారం రేపింది. కాంట్రాక్ట్ ల కేటాయింపుతోపాటు ఈవోటీల మంజూరు వంటి విషయంలో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇన్ని ఉన్నా కూడా సర్కారు ఆయన్ను మాత్రం రాజమార్గంలో పంపటం వెనక కారణాలు ఏంటో?. అవినీతిపై చర్యల విషయంలో జగన్ సర్కారు ఇలా ‘సెలక్టివ్’గా వ్యవహరిస్తుందా?.

 

 

Similar News