జగన్ చెప్పిందే జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది

Update: 2019-12-20 12:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు ఖరారు అయిపోయింది. ఇది అధికారికం కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే చెప్పారో..జీఎన్ రావు కమిటీ కూడా అదే చెప్పింది. స్వల్ప మార్పులు తప్ప అంతా సేమ్ టూ సేమ్. అమరావతిలో ఉండే అసెంబ్లీ కూడా పూర్తి కాలం సాగదు. వేసవి కాలంలో అసెంబ్లీ సమావేశాలను మళ్ళీ సచివాలయం నెలకొల్పే వైజాగ్ లో నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. వరద ముంపు లేని ప్రాంతంలోనే రాజధాని ఉండాలని సూచించారు. తూళ్ళూరుకు వరద ముప్పు ఉందని కమిటీ తెలిపింది. వైజాగ్ లో సచివాయలంతోపాటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో పాటు హైకోర్టు బెంచ్ కూడా ఉండాలని సూచించింది. అంటే ఏపీ పరిపాలన ఎక్కువ భాగం సాగేది వైజాగ్ నుంచే అని తేలిపోయింది. తూళ్ళూరులోనే అసెంబ్లీ , రాజ్ భవన్ ను కూడా ఇక్కడే నిర్మించాలని సూచించారు.

హైకోర్టు బెంచ్ లు తూళ్ళూరుతోపాటు వైజాగ్ లో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కర్నూలులో మాత్రం హైకోర్టు ప్రధాన బెంచ్ ఏర్పాటు చేయనున్నారు. శ్రీబాగ్ ఒఫ్పందంలోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉందని జీఎన్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక అందజేసిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియా ముందుకు వచ్చి నివేదికలోని ముఖ్యాంశాలను వివరించింది. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లుగా విభజించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలసి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో అభివృద్ధి పేరుతో పర్యావరణానికి విఘాతం కల్పించకూడదన్నారు. ఏపీలో ఉన్న ప్రాంతీయ అసమానతలు రూపుమాపేందుకు పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీ సిపారసులపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది కేవలం లాంఛనం మాత్రమే.

 

 

 

 

 

Similar News