పాలన అంతా ఒక్క చోటే ఉండాలి

Update: 2019-12-25 08:34 GMT

ఏపీలో ఇప్పుడు చర్చ అంతా ఒకటే. అమరావతి. తరలింపు. విశాఖపట్నం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. అమరావతి రైతులు మాత్రం ఆందోళన బాట కొనసాగిస్తూనే ఉన్నారు. అధికార వైసీపీ తప్ప..అన్ని పార్టీలు పరిపాలనా వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నాయి. కర్నూలుకు హైకోర్టు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా..పరిపాలనా రాజధాని అయిన సచివాలయం, అసెంబ్లీ, హెచ్ వోడీలు ఒకే చోట ఉండాలని ఎక్కువ పార్టీలు తేల్చిచెబుతున్నాయి. సర్కారు మాత్రం తన పని తాను చేసుకుంటూపోతోంది. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎక్కడ ఏమిటి అనే అంశం తేలిపోనుంది. మూడు రాజధానుల విషయంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం ఏ మాత్రం లేదనే సమాచారం వస్తోంది. ఈ తరుణంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అంశంపై తన అభిప్రాయాలు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటు ఉండాలని సూచించారు. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తన 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. వివాదం కోసమో, రాజకీయ కోణంలోనో తన అభిప్రాయాన్ని చూడవద్దని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేంద్రం తనను అడిగితే తాను ఇదే అభిప్రాయం చెబుతానని ఉపరాష్ట్రపతి చెప్పారు. 'అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కేంద్రీకృతం కావాలి. రాజధాని రైతులు నా వద్దకు వచ్చారు.. వాళ్ల భావోద్వేగం చూసి నా మనసు చలించింది అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు.

 

Similar News