అసెంబ్లీలో ‘ప్రత్యేక సభ్యుడి’గా వల్లభనేని వంశీ

Update: 2019-12-10 04:03 GMT

ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఉదయమే వివాదం మొదలైంది. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వటంతో టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీకి సంబంధం లేని అంశంపై మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే చంద్రబాబు గారూ..చంద్రబాబు గారూ తనకు మాట్లాడే అవకాశం లేదా? అంటూ ప్రశ్నించారు. తాను సభలో మాట్లాడతానంటే ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రశ్నలు సంధించారు. మాకు హక్కులుండవా అంటూ చంద్రబాబును నిలదీశారు. సీఎం జగన్‌ను కలవడంపై వంశీ వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానన్నారు. జగన్‌ను తాను కలవడం ఇదే మొదటిసారి ఏం కాదన్నారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ పై కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ. పప్పు అండ్ బ్యాచ్ అంటూ విమర్శలు గుప్పించారు. నేను మాట్లాడుతుంటే సభ నుంచి చంద్రబాబు ఎందుకు లేచి వెళ్లిపోయారంటూ ప్రశ్నించారు. నాతో మాట్లాడకుండా నన్ను సస్పెండ్ చేశారు. తనకు కూడా ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని..అందుకని సభలో తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గ ప్రజల కోసం తాను సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ వంశీ వినతిని పరిగణనలోకి తీసుకున్నట్లు అప్పటికప్పుడే ప్రకటించారు. ఆయనకు అనువైన సీటు చూపించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

 

 

 

Similar News