ఎంతో మంది కూలిపోయారు..మీరెంత..?

Update: 2019-12-12 14:04 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య’ దీక్షలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు కన్నీరు పాలకులకు శాపం అని వ్యాఖ్యానించారు. తాను సూట్‌కేసు కంపెనీలు పెట్టలేదని, తనకు కాంట్రాక్టులు లేవని, సినిమాలే తమ ప్రపంచమని ..ప్రజా సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రైతులు కడుపుమండి తన దీక్షకు వచ్చారని, తన పక్కన నిలబడి ఫొటోలు తీసుకునేందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో ఇంతమంది రైతులు, భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని, వారికి నివాళులర్పించి అసెంబ్లీ ప్రారంభించాలన్న ఇంగిత జ్ఞానం వైసీపీ నేతలకు లేదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బోటు ప్రమాద మృతులకు సంతాపం తెలపలేదని పవన్‌ ఆక్షేపించారు. అసెంబ్లీని హుందాగా నడపాలని, సభలో తిట్లే ఎక్కువున్నాయని ఆరోపించారు. 150మంది ఎమ్మెల్యేలు సంస్కారంతో ఉండాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు. రైతు కష్టం తెలిసే రోడ్డు మీదకు వచ్చానని తెలిపారు.

సహనం జనసేన బలమని, బలహీనత కాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. రైతు కన్నీరు ఆగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓటమి వల్ల తన ఆత్మస్థైర్యం దెబ్బతినలేదన్నారు. ఇంగ్లీష్‌ బాగా రాకే ఇంటర్‌ ఫెయిలయ్యానని తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియం పెడితే ఓకే.. కానీ తెలుగు గురించి కూడా ఆలోచించాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర ధాన్యం కొని రశీదులు ఇవ్వలేదని, కొన్న ధాన్యానికి ఇంతవరకు డబ్బు చెల్లించలేదన్నారు. సీఎం జగన్ ఇంటి రిపేర్‌ కోసం రూ.9కోట్లు బిల్లు పెట్టారని, అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సభలో విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు.

ధాన్యానికి బస్తాకు రూ.1300 కాదని, రూ.1500 ఇవ్వాలని కోరారు. రూ.1500 ఇస్తే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినట్టు అవుతుందన్నారు. మీకు కులం పట్టింపులేకపోతే... కౌలు రైతులను కులం ఎందుకు అడుగుతున్నారని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కాకినాడలో రైతు సమస్యలపై ఒక రోజు ‘రైతు సౌభాగ్య’ దీక్ష చేశారు. ఇందులో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఆరు నెలల్లోనే వైసీపీ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇంటింటికీ తీసుకువచ్చి ఇస్తామన్న బియ్యం ఏది? ఇప్పుడు ఇస్తామన్నది ఏంటి? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సన్న బియ్యం అమలు చేయగా, అవి కాస్తా ముద్ద అయిపోయాయి. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో స్వర్ణ రకం బియ్యాన్ని సార్టెక్స్ మిల్లులో వేసి హామీని నిలబెట్టుకునేందుకు ఇన్ని లక్షల మంది కడుపు కొడుతున్నారు. అవగాహన లేకే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారు” అన్నారు

 

Similar News