జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో తడిచిన రక్తం కూడు తింటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకుంటున్నట్లు 30 సంవత్సరాలు ఉంటే..రాష్ట్రంలో ప్రతి రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం రోడ్ల వెంట తిరిగి పాదయాత్రలు చేయడం కాదు.. రైతుల కన్నీరు తుడిచేందుకు, రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఇప్పుడు పాదయాత్రలు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఓటు అనే బోటు మీద తీరం దాటిన తర్వాత తెప్ప తగలేసే వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని హెచ్చరించారు. వరి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మండపేట నియోజకవర్గం వెలగతోడు గ్రామం వద్ద ధాన్యం కళ్లంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన తీరు, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు అందని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "రైతు కన్నీరు కదిలిస్తోంది.
రాష్ట్రంలో రైతుల కష్టాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరు. మనం బతికి ఉన్నాం అంటే అది రైతు వల్లేనన్నది ఏ ప్రభుత్వమైనా అర్ధం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం అప్పు చేసి రైతులు ఈ ఏడాది అయినా ఆదాయం వస్తుందన్న ఆశతో ఏటికేడాది పంటలు పండిస్తూనే ఉన్నారు. ఏ రోజూ లాభసాటి ధర చూసింది లేదు. ఇప్పటికీ గిట్టుబాటు ధర కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ రైతుకు కావాల్సింది లాభసాటి ధర. రైతు కష్టాన్ని గుర్తించాలి. గిట్టుబాటు కాదు లాభసాటి ధర కోసం ప్రయత్నాలు చేయాలి. 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని.. జనసేన పార్టీ వస్తుంది అని తెలియగానే రాత్రికి రాత్రి 87 కోట్ల రూపాయల విడుదల చేశారు. జనసేన వస్తేగానీ మీకు రైతుల కష్టాలు తెలియవా? మరి 151 మంది ఉండి ఏం లాభం? వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధం అవుతోంది. మీకు బాధ్యత లేదా? జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా రైతులకు మీరు ఇప్పుడు అండగా లేకపోతే ఇంకా ఎప్పుడు అండగా ఉంటారు? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలియగానే తెల్లవారు జామున మిల్లర్లకు ఫోన్లు చేసి నోరు విప్పితే విజిలెన్స్ దాడులు చేయిస్తామని బెదిరిస్తారు. మరీ ఇంత దిగజారిపోయారు అంటే వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు కడుపులో పెట్టుకుందో అర్థం అవుతోంది.
రైతు కడుపు కొట్టే ఏ ప్రభుత్వమైనా కాలిపోవాల్సిందే. వ్యవసాయం ఒక కులానిది కాదు అన్ని కులాల వృత్తి. అన్నం తినే వైసిపి నాయకులకు రైతుల ఆవేదన, కష్టం, కన్నీరు తెలియాలి. రైతుని కన్నీరు పెట్టించి ఆ రక్తపు కూడు తింటున్నారు మీరు. పంట పండించడం అంటే మామూలు విషయం కాదు ప్రతి మొక్కను బిడ్డతో సమంగా సాకాలి. గత ఏడాది ఐదుసార్లు మందులు పిచికారీ చేస్తే, భారీ వర్షాల కారణంగా ఈసారి ఏడుసార్లు చేయాల్సి వచ్చింది. ఇలా ఒక్క సమస్య కాదు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. రైతుల కష్టాలు పట్టించుకోకపోతే 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభం. మాటలను వక్రీకరించడం కాదు. రైతుల కష్టాన్ని తెలుసుకోండి. మీరు ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జీ కొణిదెల నాగబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.