ఉత్తరాంధ్ర వెనకబడి ఉందని ఆ ప్రాంతానికి చెందిన నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు..వారంతా పదవుల్లో ఉన్న కాలంలో ఆ ప్రాంతానికి ఏమి చేశారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఆయన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. మాట్లాడితే 70 ఏళ్లుగా గంజి తాగుతున్నాం మా ప్రాంతానికి మేలు జరుగుతుంటే అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఆ మాట్లాడే వారు 15 ఏళ్ల పాటు మంత్రిగా ఉండి ఏం చేశారు?” అని ప్రశ్నించారు. “స్వార్ధపూరితంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు శ్రేయస్కరం కాదు. మనం తీసుకునే నిర్ణయాలు ఎక్కువ మందికి నచ్చినా కొంత మంది వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఎవరు తీసుకునే నిర్ణయం అయినా అభివృద్ధి అనేది ఒక బాధ్యతగా ఉండాలి. రాజకీయ పార్టీగా ఒక బాధ్యతగా పని చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మనందరి మీదా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడగలిగేది ఒక జనసేన పార్టీ మాత్రమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగాం. గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దు, వారు ఇస్తేనే తీసుకోవాలని బలంగా చెప్పారు.
ఇప్పుడు రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి హైకోర్టు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ల క్వార్టర్స్ నిర్మించారు. ఇప్పుడు రాజధాని కాదు అంటే రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో రైతుల తరఫున మొదట పర్యటన చేసింది జనసేన పార్టీనే. అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు అని అక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఆయన వస్తే ప్రభుత్వాలు స్పందిస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. రాజకీయాల్లో ఆది నుంచి వెనుకబడిన ప్రాంతాల పేరు చెప్పి పదవులు తెచ్చుకోవడం మినహా నాయకులు ఆ ప్రాంతాలకు మేలు చేసింది లేదు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు 25 సంవత్సరాలకు పైగా రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదు. ఉత్తరాంధ్రలో సమస్యలు ఈనాటివి కాదు. రాజధాని హైదరాబాద్ నగరానికి అనుకుని ఉండే నల్గొండ జిల్లా నుంచి ఎప్పుడూ ముగ్గురు మంత్రులు ప్రభుత్వంలో ఉండేవారు. జిల్లా ప్రజలు ఫ్లోరొసిస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఎందుకు పట్టించు కోలేదు. అవన్నీ ఉద్దేశపూర్వకంగా ప్రజల జీవితాలతో ఆటలాడడమే. ఒక నిర్ణయం ఒక ప్రాంతానికే మంచి చేస్తుంది అంటే అది మంచిది కాదు.