ఏపీ బిజెపి అమరావతికే మద్దతుగా నిలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు అమరావతి రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రాజధానికి సంబంధించి శాశ్వత భవనాలు కట్టాలని గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడిని కూడా కోరినట్లు తెలిపారు. సీఎం మారినంత మాత్రాన రాజధాని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అదే సమయంలో సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
తనను గెలిపిస్తే స్వర్గం చూపుతానని ప్రజలకు ఆశచూపించిన జగన్ ఇప్పుడు ద్వంసం చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజదాని తరలింపు పిచ్చి ఆలోచన అన్నారు. ముందు జగన్ అమరావతికి ఎందుకు అంగీకరించారు? అని కన్నా ప్రశ్నించారు.రాజధాని రైతుల సమస్య మాత్రమే కాదు... రాష్ట్ర ప్రజలందరి సమస్య.కేంద్రం ఈ నిర్మాణం కోసం 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన అన్నారు.