జగన్ కు జె సీ చురకలు..ప్రశంసలు

Update: 2019-12-11 09:19 GMT

తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు చురకలు అంటిస్తూనే..మరోవైపు పొగడ్తలు కూడా కురిపించారు. జగన్ హయాంలో తాత రాజారెడ్డి పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రామగోపాల్ వర్మ సినిమా అంశాన్ని కూడా ప్రస్తావించారు. వర్మకు సినిమా పేర్లు పెట్టడం రాదని ఎద్దేవా చేశారు. వర్మ తీసిన సినిమాకు ‘రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం’ అని పేరు పెట్టాల్సిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని.. నామినేటెడ్‌ పోస్టులు రెడ్లకు ఇచ్చినందుకు జగన్‌ను అభినందిస్తున్నానన్నారు.

ఈ సందర్భంగా జగన్‌ గట్స్‌ ను మెచ్చుకుంటున్నానని.. అయితే చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని విమర్శించారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారని.. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. డబ్బులు లేవుగా అంటూ రాష్ట్ర ఆర్థికపరిస్థితిని గుర్తు చేశారు. నెల్లూరులో మాఫియాలు ఉన్నాయని ఆనం అనకుండా ఉండాల్సిందన్నారు. ఎక్కడ మాఫియా లేదో చెప్పమనండంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌ అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్‌ ఆరు నెలల పాలన చాలా బాగుంది ’ అని పేర్కొన్నారు.

 

Similar News