శిక్షలు కూడా ప్రభుత్వ పెద్దలే వేస్తారా? జగన్ వ్యాఖ్యల కలకలం

Update: 2019-12-14 04:48 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏకంగా శాసనసభలో జగన్ సుప్రీంకోర్టు నిర్ణయాలను తప్పుపట్టినట్లు వ్యాఖ్యానించటం ఒకెత్తు అయితే..శిక్షలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలంగాణ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ ను సుప్రీంకోర్టు కమిటీ, ఎన్ హెచ్ఆర్ సీ కమిటీ తప్పుపట్టకూడదు అన్నట్లు జగన్ వ్యాఖ్యానించారు. అలా చేస్తే ఏ పోలీసు, ఏ ప్రభుత్వ పెద్దా శిక్షించేందుకు ముందుకు రారని సభలోనే ప్రకటించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులే శిక్షలు విధిస్తే మరి కోర్టులు..న్యాయమూర్తులు ఏమి చేయాలని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఎవరి పరిధి ఏంటో రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని..అది కాదని ముఖ్యమంత్రులు..పోలీసులే నేరుగా శిక్షలు అమలు చేస్తారు..దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదు అనే తరహాలో ఓ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటం ఓ మాత్రం సమర్ధనీయంకాదని చెబుతున్నారు.

శిక్షలు వేసే అధికారం కూడా ముఖ్యమంత్రులు, పోలీసులకు ఇవ్వాలని జగన్ కోరుకుంటున్నారా?. ఏపీ ఓ ప్రత్యేక దేశం కాదని.. రాష్ట్రం అనే సంగతి మర్చిపోయి జగన్ మాట్లాడుతున్నట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యంత హేయమైన రేప్ లపై కఠిన చట్టాలు ఉండటం అభిలషనీయమే అయినా..ప్రజల్లో మార్పు తీసుకురాకుండా రేప్ లను నిరోధించటం సాధ్యం కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దిశ రేప్ కేసులో ఓ వైపు ఎన్ కౌంటర్ జరిగింది..మరో వైపు ఏపీ రేప్ కేసు నిరూపణ అయితే ఉరి శిక్ష ఏపీ సర్కారు వేస్తామని చెబుతోంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఓ వైపు సభలో దిశ బిల్లుపై చర్చ జరుగుతుండంగానే గుంటూరులో ఓ ఐదేళ్ల బాలిక రేప్ కు గురైంది. కేవలం భయంతోనో..ఎన్ కౌంటర్లతోనే ఇవి ఆగవు అనటానికి ఇది చాలదా? అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

రేప్ లు వంటి దుర్మార్గమైన ఘటనలు జరక్కుండా చేయటానికి సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని..ఈ దిశగా అత్యంత పకడ్భందీగా చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు కఠిన చట్టాలతోపాటు మరోవైపు సమాజంలో మార్పు కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే దిశ చట్టంలో ఎన్నో లోపాలు ఉన్నాయని..అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావటానికే చాలా సమయం పడుతుందని కానీ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన చట్టంలో గడువులు వాస్తవ దృక్ఫదంతో లేవని చెబుతున్నారు. దీనికి తోడు గవర్నర్ తోపాటు రాష్ట్రపతి ఈ శిక్షల చట్టానికి ఆమోదం తెలపటం కష్టమే అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

Similar News