ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో హామీ అమలు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ శనివారం నాడు ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకాన్ని ప్రారంభించారు. జగన్ తన పుట్టిన రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మవరంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నల కష్టాలు తన కన్నా బాగా ఎవరికీ తెలీదన్నారు. నేతన్నలకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. అగ్గిపెట్టేలో పట్టే చీర దగ్గర నుంచి స్వాతంత్రోద్యమం వరకు నేతన్నలకు ఒక చరిత్ర ఉందన్నారు. ధర్మవరం చేనేతల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. చేనేతల ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదన్నారు. చేనేత కుటుంబాలు పేదరికం, అప్పుల బాధతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆప్కో పేరుతో దోచుకుందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ‘పాదయాత్రలో చేనేతల కష్టాన్ని చూశాను.. బాధను విన్నాను. నేను ఉన్నానని చెప్పి ఆ రోజు అందరికి చెప్పానన్నారు. చెప్పిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఆ మాటను నిలబెట్టుకుంటూ వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఇదే ధర్మవరంలో ప్రారంభిస్తున్నాను.
రాష్ట్రంలో దాదాపు 85 వేల కుటుంబాలకు ఈ సాయాన్ని విడుదల చేయబోతున్నాం. చేనేత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. సొమ్మును మీరు చేసిన పాత అప్పులకు బ్యాంకు వాళ్లు జమ చేసుకోకుండా వారితో కూడా మాట్లాడామని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు నేరుగా అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ.3.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ‘నవరత్నాలు’ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.