ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ రేప్ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారు. సినిమాల్లో అయితే హీరో ఎన్‌కౌంటర్ చేస్తే చప్పట్లు కొడతాం. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అదే నిజ జీవితంలో జరిగితే... జరిగింది తప్పు...ఇలా ఎందుకు చేశారని నిలదీస్తున్నారు. ఏదైనా జరిగితే బాధిత కుటుంబాలకు కావల్సింది వెంటనే ఉపశమనం. అలా తమకు సత్వర న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని కాల్చేయాలని అనుకోరు. జరుగుతున్న జాప్యం చూసినప్పుడు... సంవత్సరాలు తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదనే బాధ వారిని కలిచివేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో తెలంగాణ ప్రభుత్వం దాన్నే అమలు చేసింది. హ్యాట్సాఫ్ టూ కేసీఆర్, తెలంగాణ పోలీసులు అని జగన్ వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు అసెంబ్లీలో మహిళా భద్రత అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని తెలిపారు. ‘మేం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలు నన్ను కలిచివేశాయి. దీన్ని మార్చాలనే తాపత్రయమే ఈ రోజు చట్టసభలో ఏం చేస్తే... మార్పులు తీసుకు రాగలుగుతామని ఆలోచనతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. హైదరాబాద్‌లో దిశ ఉదంతం తీసుకుంటే ఇది నిజంగా సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన. ఆ వైద్యురాలు టోల్‌గేట్ వద్ద ఉండగా బండికి పంక్చర్ చేసి, దాన్ని రిపేర్ చేయిస్తామని నమ్మించి అత్యాచారం చేసి, కాల్చేసిన ఘటన మన కళ్ల ముందే కనబడుతుంది. ఇలాంటి దారుణాలపై పోలీసులు, రాజకీయ నాయకులు ఎలా స్పందించాలని ఆలోచన చేస్తే... నిజంగా బాధ అనిపించింది.
ఇలాంటి సంఘటనే మన రాష్ట్రంలో జరిగితే..మనం ఎలా స్పందించాలి. ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డవారిని కాల్చేసినా కూడా తప్పులేదని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక తండ్రిగా ఎలా స్పందించాలి. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. కోర్టుల‍్లో జాప్యం జరగకూడదు. కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తప్పు చేసి నిందితులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుబడినా శిక్షలు పడటం లేదు. ఘటన జరిగిన వారంలోపు విచారణ పూర్తి చేయాలి. మూడు వారాల్లో తప్పు చేసినవారికి శిక్ష పడాలి. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి. మనసాక్షి కూడా లేకుండా సోషల్ మీడియాలో కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన శిక్షలు ఉండేలా చట్టం తెస్తాం. మద్యం వల్లే మనుషులు రాక్షసులు అవుతున్నారు. ఐదారుగురు మనుషులు కూర్చుని తాగితే మృగాలవుతారు.
అందుకే పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు రద్దు చేశాం. పోర్న్ వెబ్‌సైట్లపై బ్యాన్ ఉన్నా కూడా కట్టడి చేయలేకపోతున్నాం. ఇప‍్పటికైనా చట్టాలు మారాలి. స్పందించే ధోరణి కూడా మారాలి. అఘాయిత్యాలకు పాల్పడేవారిని కొన్నిదేశాల్లో షూట్ ఎట్ సైట్ చేస్తారు. ఇటువంటి విషయాల్లో మన దేశంతో పాటు రాష్ట్రంలోనూ చట్టాలను సవరించాలి. ’ అని అభిప్రాయపడ్డారు. ఇందు కోసం ప్రభుత్వం అందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు కోరుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం సలహాలు ఇవ్వడం తప్ప అన్ని విమర్శలు చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేటు పెరగటంతో పాటు, మహిళలపై అత్యాచారాలు, హత్యకేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అన్నారు.