మూడు రాజధానులపై తుది నిర్ణయం వాయిదా పడింది. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని భావించినా కూడా ఇది వాయిదా పడింది. అయితే ఇప్పటికే సమర్పించిన జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో సమగ్రంగా చర్చించారు. జీఎన్ రావు నివేదికతోపాటు త్వరలో అందనున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీఎస్ జీ) నివేదికలోని అంశాలను ఈ హై లెవల్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీ నివేదిక తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నాయి. అయితే కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని సుదీర్ఘంగా చెప్పిన అంశాలను పరిశీలిస్తే రాజధాని తరలింపు అనివార్యం అని స్పష్టం అవుతుంది. అయితే ఇది ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. 54 వేల ఎకరాల్ల మౌలికసదుపాయాల కల్పనకు చాలా వ్యయం అవుతుందని..దీని కంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని నాని తెలిపారు. గత ప్రభుత్వం ఒక ఊహజనితమైన, కలల రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన శివరామక్రిష్ణయ్య నివేదిక కంటే మాజీమంత్రి నారాయణ, వారి బృందం ఇఛ్చిన నివేదికను ఆమోదించి ఒక కలల రాజధానిని నిర్మించాలని నిర్ణయం తీసుకుని 2015-16లో 33 వేల ఎకరాల రైతుల భూమిని మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ అసైన్డ్, ప్రభుత్వ బంజర్లు కలుపుకుని సుమారు 54 వేల ఎకరాల్లో ..ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా ప్రపంచం ఈర్షపడేలా రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 54 వేల ఎకరాల్లో నిర్మాణానకి రాజధాని కి మౌలికసదుపాయలకు ఎకరాకు 2 కోట్ల లెక్కన 1.10 లక్షల కోట్ల నిర్మాణ వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు కష్టపడి ఏమి చేశారో అందరూ చూశారన్నారు. బోస్టన్ కమిటీ నివేదిక జనవరి మొదటి వారంలో వస్తుందని తెలిపారు. అమరావతి రైతుల ఆందోళన సహజమే అని..అయితే తమ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీలో మంత్రులు, కొంత మంది ఉన్నతాధికారులు కూడా ఉంటారని పేర్ని నాని తెలిపారు.