హెరిటేజ్ లో కిలో ఉల్లి 200కు అమ్ముతున్నారు

Update: 2019-12-09 06:38 GMT

అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యంత కీలకమైన మహిళా భద్రత అంశంపై హోం మంత్రి సుచరిత మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు ఉల్లిధరల అంశంపై నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడితో సహా ఆ పార్టీ నేతలు అందరూ సభ ప్రారంభం సమయంలోనే ఉల్లి రేట్ల పెరుగుదలను నిరసిస్తూ సభలోకి అడుగుపెట్టారు. ఇదే అంశంపై టీడీపీ వాయిదా తీర్మానం కూడా ఇఛ్చింది. అయితే అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ఉల్లి ధర పేరు చెప్పి సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించటం సరికాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

ఉల్లి ధరల అంశంపై తమ ప్రభుత్వానికి ఆందోళన ఉందని..అయినా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఉల్లి ని కిలో 25 రూపాయలకే ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఓ వైపు రైతులను ఆదుకుంటూనే ప్రజలకు కూడా ఉల్లిపాయలను కిలో 25 రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో కిలో ఉల్లిపాయలను 200 రూపాయలకు అమ్ముతున్నారని..వీళ్ళా ప్రభుత్వం గురించి మాట్లాడేది అని జగన్ ధ్వజమెత్తారు. అత్యంత కీలకమైన మహిళా భధ్రత అంశాన్ని కొనసాగించాలని కోరారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ హెరిటేజ్ లో ఉల్లిని 25 రూపాయలకే ఇస్తారా? అని ప్రశ్నించారు. స్పీకర్ కు ఉల్లిపాయలు గిఫ్ట్ గా పంపటాన్ని ఆయన తప్పుపట్టారు.

 

 

Similar News