మూడు రాజధానులకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై బిజెపి ఆచితూచి స్పందించింది. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు బుధవారం నాడు ఢిల్లీలో ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా రాజధాని అంశంపై శివరామకృష్ణ కమిటీ చేసిన సూచలను జీవీఎల్ ప్రస్తావించారు. ‘ శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. అయితే గత ప్రభుత్వం రిపోర్టులు, గ్రాఫిక్స్ కే పరిమితమైంది. చంద్రబాబు కూడా గతంలో నారాయణ కమిటీని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారు. అధికార వికేంద్రీకరణను పట్టించుకోలేదు. దీంతో సీమాంధ్ర చాలా నష్టపోయింది. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.