అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తప్పుపట్టింది. వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడుగా ఎలా గుర్తిస్తారని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు విస్మయానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ జరుగుతోందన్నారు. అసెంబ్లీ గేటు ఎదుట మీడియాతో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య.. క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు సభలో వంశీకి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. మంత్రులు పచ్చి బూతులు తిడుతున్నారని ధ్వజమెత్తారు.
సభను అపహాస్యం చేస్తూ స్పీకర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు అయి ఆరు నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాటని తప్పిన సీఎం జగన్.. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇంకా టీడీపీ సభ్యులను చేర్చుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.