టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వటమే పాపంలా ఉంది

Update: 2019-12-11 07:34 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల కు సంబంధించిన అంశంపై టీడీపీ సభ్యుడు వేసిన ప్రశ్నకు సమాధానంలో చెప్పే సమయంలో సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. సలహాదారుల పోస్టులను నామినేటెడ్ పోస్టులగా చూడకూడదన్నారు. అవి ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు..సూచనలు తీసుకోవటానికి ఇచ్చినవి అని..వాటి కాల పరిమితి కూడా ఒకటి నుంచి రెండేళ్లు మాత్రమే ఉంటుందని తెలిపారు.అయినా ప్రతి విషయంలో రాజకీయాలు, వక్రీకరణకు పాల్పడే టీడీపీ సభ్యులకు మైక్‌ ఇవ్వడం పాపం లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలోనూ టీడీపీ దారుణమైన వక్రీకరణకు పాల్పడుతోందని, చరిత్రలో ఇంత దారుణంగా వక్రీకరణ చేసే వ్యక్తులు వీళ్ళు మాత్రమే అని అన్నారు. ‘మా ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించే శాసనాన్ని తీసుకొచ్చాం. దేశ చరిత్రలోనే ఇలాంటి చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం మనదే. నామినేటెడ్‌ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. ఒకప్పుడు మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్‌ పదవులు రాజకీయ పలుకుబడి ఉన్న ఓసీ వర్గానికి మాత్రమే వచ్చేవి.

కానీ ఈ చట్టాల వల్ల కృష్ణాజిల్లాలో 19 మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఉంటే అందులో పది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయి. ఆలయ కమిటీ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. జిల్లా సహకార బ్యాంకులు, మార్కెటింగ్‌ సొసైటీల్లోనూ 50 రిజర్వేషన్‌ కల్పించాం. ఈ రిజర్వేషన్‌లోనూ 50శాతం పదవులు మహిళలకు ఇచ్చాం’ అని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఇంకా 150కుపైగా చైర్మన్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, లోకల్‌ బాడీ ఎన్నికల తర్వాత వాటిని నియమిస్తామని తెలిపారు. ఈ నియమకాలు ముగిసిన తర్వాత తుది జాబితాను అసెంబ్లీలో విడుదల చేస్తామని, ఈ జాబితాలో కచ్చితంగా 50శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటటీలకు కేటాయిస్తామన్నారు.

 

Similar News