వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు మాజీ ఎంపీ గోకరాజు రంగరాజు సోదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. వీరందరికీ సీఎం జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
వైసీపీలో చేరిక అనంతరం రంగరాజు మీడియాతో మాట్లాడుతూ... ‘జగన్ పాలన అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వంలో పని చేయడం అదృష్టం. ఈ పార్టీలో నేను కొత్తవాడిని అనుకోవడం లేదు. వైఎస్సార్ సీపీలో అందరూ మా వాళ్లే ఉన్నారు. పార్టీ పిలుపు మేరకు వైసీపీలో చేరాను’ అని తెలిపారు. గోకరాజు రామరాజు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇవాళ వైఎస్ జగన్ నాయకత్వంలో సొంతగూటికి చేరారని తెలిపారు.