‘దిశ’ చట్టానికి గవర్నర్ ఆమోదం అనుమానమే!?

Update: 2019-12-11 15:52 GMT

ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద మహిళల రక్షణకు సంబంధించి ‘ఏపీ దిశ యాక్ట్’ తీసుకు వస్తోంది. దీనికి బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఇక అసెంబ్లీలో ఆమోదం పొందటమే తరువాయి. అసెంబ్లీలో వైసీపీకి సంపూర్ణ బలం ఉంది..ప్రతిపక్షాలు కూడా దీనికి అడ్డుచెప్పే అవకాశం లేదు. అయినా సరే గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇది కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉండటమే అని చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా ఏపీ సర్కారు కొత్త బిల్లుకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగు నెలలు ఉన్న విచారణ సమయాన్ని ఈ బిల్లులో 21 రోజులకు కుదించారు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారనున్నట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా..విచారణ గడువును తగ్గించటంపైనే అటు గవర్నర్ ...ఇటు కేంద్రం కూడా అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతోపాటు కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెఛ్ఆర్ సీ)పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన విమర్శలు కూడా ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉందని న్యాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎవరైనా ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే ఎన్ హెఛ్ఆర్ సీ అసెంబ్లీ రికార్డులను కోరి విచారణ జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. దిశ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పెద్ద సమస్య కాకపోయినా..గవర్నర్ దీన్ని కేంద్రానికి నివేదించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 

 

 

 

Similar News