జగన్ నిర్ణయానికి చిరంజీవి మద్దతు

Update: 2019-12-21 11:07 GMT

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ..రాజధానుల మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు నిర్ణయంతో విభేదిస్తుంటే..చిరంజీవి మాత్రం అందుకు అనుకూలంగా బహిరంగ లేఖ రాయటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో లక్ష కోట్ల రూపాయలతో ఓ ప్రాంతంలోనే అభివృద్ధి చేయటం సరికాదని వ్యాఖ్యానించారు. చిరంజీవి రాసిన లేఖలోని ముఖ్యాంశాలు..‘అధికార,పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యం. రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది. *అమరావతి - శాసన నిర్వాహక , విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూల్ - న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలి. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి. గత అభివృద్ధి , పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది.

ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది. సాగు,తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్ కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు ,అభద్రతాభావాన్ని తొలగించాలి. వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలు నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.’ అని పేర్కొన్నారు.

 

 

 

Similar News