రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు

Update: 2019-12-31 04:24 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. ఏపీకి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులను రాయపాటికి సంబంధించిన ట్రాన్స్ స్ట్రాయ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఈ కంపెనీ పలు వివాదాల్లో చిక్కుకోగా ఈ పనులను వివిధ సంస్థలకు కేటాయించారు. ట్రాన్స్ స్ట్రాయ్ పై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో మంగళవారం నాడు రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక​ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌, గుంటూరు, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాలు,, కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు.

ట్రాన్స్ స్ట్రాయ్ ఎండీ శ్రీధర్ ఇంట్లోనూ సీబీఐ దాడులు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. ఇండియన్ బ్యాంకు నుంచి 500 కోట్ల రూపాయల రుణం తీసుకుని కంపెనీ తిరిగి చెల్లించకపోవటంతో సీబీఐ కేసు పెట్టింది. ఈ కారణంగానే రాయపాటికి చెందిన ట్రాన్స్‌ ట్రాయ్ కంపెనీలోనూ సీబీఐ అధికారులు సోధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బ్యాంకు రుణాల అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించిన అంశంలోనూ సీబీఐ విచారణ కొనసాగుతుందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. నూతన సంవత్సరం ముందు ఈ సీబీఐ దాడులు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.

 

Similar News