ఏపీ నూతన రాజధాని అమరావతిపై ఏపీ సర్కారు సంచలన ప్రకటన చేసింది. మండలిలో టీడీపీ సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కీలక ప్రకటన చేశారు. అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని మార్చే ప్రతిపాదన ఏదైనా ఉందా? అని టీడీపీ సభ్యులు ప్రశ్న వేయగా..బొత్స తన సమాధానంలో ‘లేదండి’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ అమరావతిపై చేసిన ఖర్చు ఎంత?.రాష్ట్ర రాజధానిని మార్చటం వల్ల పడే భారం ఎంత అన్న ప్రశ్నలకు ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానం ఇఛ్చారు.
మండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన ప్రకటనతో ‘అమరావతి’పై ఇప్పటివరకూ ఉన్న గందరగోళం తొలగినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాత అమరావతిపై రకరకాల ప్రకటనలు చేయటంతో ఈ అంశంపై కొంత గందరగోళం నెలకొంది. దీంతోపాటు సర్కారు కొత్తగా రాజధాని అంశాన్ని తేల్చేందుకు అంటూ ఓ నిపుణులు కమిటీని కూడా వేసింది. దీంతో గందరగోళం మరింత పెరిగింది. తాజాగా మండలిలో బొత్స ఇచ్చిన సమాధానంతో రాజధానిపై ఒకింత స్పష్టత వచ్చినట్లు అయిందనే భావించొచ్చు.