చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలి

Update: 2019-12-11 05:28 GMT

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని శాసనసభ సభ నుంచి సస్పెండ్ చేయాలని..అప్పటి వరకూ సభ జరగటానికి వీల్లేదని అధికార వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని..ఆయన్ను సభ నుంచి బహిష్కరించాలనని మరికొందరు కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకుంది. మధ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని అధికారంలో ఉండగా ఎందుకు ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయలేదని..మునిసిపల్ స్కూల్స్ లో చంద్రబాబు తన బినామీ నారాయణ ద్వారా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గారని విమర్శించారు. సాక్షిలో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా రాస్తే మాత్రం మీరు చేయాలనుకుంటే ఎవరు ఆపేవారు అంటూ జగన్ ప్రశ్నించారు.

గురువారం నాడు ఇదే అంశంపై స్వల్పకాలిక చర్చ ఉన్నందున ఇక ఈ అంశాన్ని ఇంతటితో ముగించాలని జగన్ కోరారు. ఇదే సమయంలో చంద్రబాబు తన వాదన విన్పించేందుకు సిద్దమవగా స్పీకర్ తమ్మినేని మైక్ ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పీకర్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహరించిన తీరు ఏ మాత్రం సరికాదని అన్నారు. సభలో ప్రతిపక్ష నేత హావభావాలు దారుణంగా ఉన్నాయి. బెదిరించేలా ఉన్నాయి. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. సభలో ప్రతిపక్ష నేత వ్యవహరించేది ఇలాగేనా? స్పీకర్ సీరియస్ అయ్యారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి చంద్రబాబుపై చర్యకు డిమాండ్ చేశారు. వెనకబడిన వర్గాలకు చెందిన స్పీకర్ ను అవమానించిన చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతపై చర్యలు తీసుకోవాలి. అప్పటివరకూ సభ జరగటానికి వీల్లేదని అన్నారు.

40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేయటం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు అయితే చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మెడికల్ ఎమర్జెన్సీ..ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాకే సభకు తీసుకురావాలి. చాలు ఇక మీ సేవలు రాష్ట్రానికి. పార్లమెంట్ లో వెళ్లినప్పుడు వంగున్నారు. అమరావతిలో పడుకున్నారు. తాజాగా ఉల్లిపాయల దండలు వేసుకుతిరుగుతున్నారు. పూర్తి స్థాయిలో వైద్యం అందించాలి.’ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ స్పీకర్ ను సభలో అందరూ గౌరవించాలన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయం అని ప్రకటించారు. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ తాను ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తున్నాని..ప్రతిపక్ష నేత విజ్ణతకే వదిలేస్తానని ప్రకటించి మరో ప్రశ్నను టేకప్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడేందుకు ఛాన్స్ కోరినా ఆయనకు అవకాశం రాలేదు.

 

 

Similar News