టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఊరట

Update: 2019-11-22 10:46 GMT

పౌరసత్వం రద్దుతో షాక్ కు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. రమేష్‌ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విషయమై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా, చెన్నమనేని తరపున సీనియర్‌ న్యాయవాది వేదల వెంకటరమణ వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేష్‌ జర్మనీలో అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ లో పీహెచ్‌డీ చేశాడని తెలిపారు. 2008 జనవరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, 2009లో పౌరసత్వం వచ్చిందని వెల్లడించారు. తర్వాత ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డు జారీ చేసిందని వివరించారు. చెన్నమనేని రమేష్‌ 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2010 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారని తెలిపారు.

2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచి ప్రజాసేవ చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రతివాది అయిన ఆది శ్రీనివాస్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. భారతీయ పౌరుడు కాని చెన్నమనేని రమేష్‌ తప్పుడు అఫిడవిట్‌ పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారని వాదించారు. చట్టాలను మోసం చేసే వాళ్లు చట్టసభల్లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు హోంశాఖ చెప్పిందని గుర్తు చేశారు. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని అనేక ఆధారాలు ఉన్నందున హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు స్టే విధించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

Similar News