అందరి ‘టార్గెట్ నారా లోకేష్’!

Update: 2019-11-15 10:30 GMT

అధికారంలో ఉండగా నారా లోకేష్ తన ‘పవర్’ చూపించారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ సత్తా చూపిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కీలక, ప్రధాన నిర్ణయాలు అన్నీ చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే సాగాయి. అదే సమయంలో సీనియర్ మంత్రులు, నేతలను కూడా నారా లోకేష్ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కలవటానికి కూడా కొంత మందికి సమయం ఇవ్వలేదు. నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకూ లోకేష్ దగ్గర కొన్ని సార్లు ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఎవరూ ఊహించని రీతిలో 23 సీట్లకు పరిమితం అయింది. అంతే కాదు..మరో వైపు చంద్రబాబునాయుడి ప్రతిపక్ష హోదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేకుండా చేద్దామని ఓ వైపు వైసీపీ మరో వైపు బిజెపి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో వైపు చంద్రబాబునాయుడు నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించి ఆయనకు పార్టీపై పట్టు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అధికారంలో ఉండగా తనకు తిరుగేలేదని అన్నట్లు వ్యవహరించిన నారా లోకేష్ కు మరి టీడీపీ నేతలు ఇప్పుడు మనస్పూర్తిగా సహకరిస్తారా?.

నారా లోకేష్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎధిగారు అంటే..అది కేవలం చంద్రబాబు వల్లే అన్న సంగతి తెలిసిందే. అలాగే మిగిలిన నేతలు కూడా తమ తమ జిల్లాల్లో వారి వారి వారసత్వాలు..పట్టు కూడా పార్టీకి కీలకమే కదా?. మరి నారా లోకేష్ తన రాజకీయ వారసత్వం చూసుకున్నట్లు పార్టీ సీనియర్ నేతల వారసులు..నేతలు కూడా అలాగే చూసుకుంటారు కదా?. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీలో కీలక నేతలు చాలా మంది ఇప్పుడు చంద్రబాబు కంటే నారా లోకేష్ పైనే గుర్రుగా ఉన్నారని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. దీనికి ప్రధాన కారణం ఆయన అధికారంలో ఉండగా వ్యవహరించిన తీరే అంటున్నారు. తాజాగా పార్టీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. వర్ధంతికి..జయంతికి తేడా తెలియని వాళ్ళ చేతిలో పార్టీ నిలబడుతుందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఈ మాటలు బహిరంగంగా చెప్పారు...ఇవే మాటలు అంతర్గతంగా చెప్పే నేతలు ఎంత మందో. అధికారంలో ఉండగా కాంట్రాక్ట్ లు ఇప్పించకపోయినా..తాము చెప్పిన పనులు చేయకపోయినా కూడా పెద్దగా పట్టించుకొనే వాళ్ళం కాదని..కానీ లోకేష్ వ్యవహరించిన తీరు ఎక్కువ మంది నేతల మనసును కష్టపెట్టిందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

టీడీపీతో సహా ఏ ప్రాంతీయ పార్టీలో అయినా అధినేతతోపాటు..జిల్లాల్లో పట్టున్న కీలక నేతలు కూడా ముఖ్యం. అందరూ కలసి పనిచేస్తేనే విజయం అయినా..పార్టీకి మనుగడ అయినా ఉంటాయి. అంతే కానీ..మేం చెపుతాం..మీరు పాటించాలి అంటే సాగే పరిస్థితులు ప్రస్తుత రాజకీయాల్లో సాధ్యం కాదని ఓ నేత వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో పరాజయం పాలైన టీడీపీలో ఎక్కువ మంది నేతలు రకరకాల కారణాలతో ఇప్పటికిప్పుడు వైసీపీ సర్కారుపై పోరాటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అధికారంలో ఉండగా తమను ఏ మాత్రం పట్టించుకోని పార్టీ కోసం తాము ఇప్పటి నుంచే పోరాడి..కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముందని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పోరాడితే మీ వెనక మేం ఉన్నాం అని నమ్మకం కలిగించటంలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు విఫలమయ్యారని...ఆ నమ్మకాన్ని నేతల దగ్గర నుంచి పొందటమే ప్రస్తుతం టీడీపీ ముందున్న అతి పెద్ద సవాల్ అని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎవరెవరినో అందలం ఎక్కిస్తే ఇలానే ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ గడ్డు పరిస్థితి నుంచి పార్టీని చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు ఎలా గట్టెక్కిస్తారో వేచిచూడాల్సిందే.

Similar News