ఏపీలో ఇసుక రాజకీయం ముదురుతోంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు దమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇసుక అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు అమరావతిలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలసి ఇసుక సమస్యపై ఫిర్యాదు చేయగా..టీడీపీ ఏకంగా వైసీపీ నేతలు, మంత్రులపై చార్జిషీట్ అంటూ పలు పేర్లను విడుదల చేసింది. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజా తదితరులు వైసీపీ నేతల పేర్లతో చార్జిషీట్ విడుదల చేశారు. జిల్లాల వారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఈ పేర్లు ప్రకటించారు. 13 జిల్లాల్లో 60 మంది వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వీరు.. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థ సారధి, ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రోజా, పెద్ది రెడ్డి, వారి అనుచరులకు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. ఎన్నడూ రాని ఇసుక కొరత ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి చోటా వైసీపీ నేతల ప్రమేయంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని దుయ్యబట్టారు. ఇసుక కృత్రిమ కొరతపై ఈనెల 14న చంద్రబాబు దీక్ష చేపడతారని తెలిపారు.