రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-11-08 08:39 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా రజనీకాంత్ బిజెపికి సన్నిహితం అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బిజెపి నేతలు కూడా రజనీకాంత్ విషయంలో చాలా సానుకూలంగా ఉంటూ ఆయన్ను తమ వైపు తిప్పుకోవటం ద్వారా దక్షిణాదిలోని అత్యంత కీలకమైన తమిళనాడులో రాజకీయంగా పాగా వేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాషాయ రంగు పులమోద్దు అని వ్యాఖ్యానించారు. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టారు. ‘నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయరంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమకండి. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెరలేపవద్దు’ అని వ్యాఖ్యానించారు.

తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం అయిన రజినీకాంత్‌ను తిరువళ్లవర్‌ విగ్రహ వివాదంపై స్పందించాలని మీడియా కోరింది. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ బిజెపి గురించి తన వైఖరిని స్పష్టం చేశారు. రజనీ వ్యాఖ్యలతో బిజెపితో దోస్తానా అన్నది లేదని స్పష్టం అయింది.

 

 

Similar News