ఇసుక సమస్యపై గవర్నర్ కు జనసేన ఫిర్యాదు

Update: 2019-11-12 10:42 GMT
ఇసుక సమస్యపై గవర్నర్ కు జనసేన ఫిర్యాదు
  • whatsapp icon

ఏపీని కుదిపేస్తున్న ఇసుక సమస్య వ్యవహారంపై ఓ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టగా..ప్రతిపక్షాలు మాత్రం తమ పని తాము చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఏకంగా ఇసుక అక్రమాలకు వీరే కారణం అంటూ అధికార పార్టీ నేతల పేర్లుతో ఓ చార్జ్ షీట్ విడుదల చేసింది. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలసి ఓ వినతిపత్రం అందజేశారు. అందులో ఆయన ఇసుక సమస్యకు కారణాలు..పరిష్కార మార్గాలను కూడా సూచించారు. ఏపీలో ఇసుక సమస్య వెనక రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. గ్రామ వాలంటీర్లతోపాటు స్థానిక నాయకులు కూడా ఇసుక వ్యవహారంలో తలదూరుస్తున్నారని ఆరోపించారు. జనసేన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు కొన్ని....రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తెచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేశాక, దాదాపు నాలుగు నెలల పాటు, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా, ఇసుక తవ్వకాలు, రవాణా, పంపిణీలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. సెప్టెంబర్ నెల తర్వాత కూడా ఇసుక తవ్వకాలను కేవలం కొన్ని రీచ్‌లకే పరిమితం చేస్తూ ఆంక్షలు విధించారు.

గతంలో దాదాపు 240 రీచ్‌లలో తవ్వకాలు జరిగేవి.. ఇప్పుడా సంఖ్య 90 రీచ్‌లకు తగ్గిపోయింది. ఇసుక తవ్వకాలు, రవాణా, పంపిణీ లాంటి విధులను నిర్వర్తించడంలో ఏపీఎండీసీ తగినంత సిద్ధంగా లేకపోయినా.. ఈ పనులను ఏపీఎండీసీకి కేటాయించారు. ఆనకట్టలు, బ్యారేజ్‌లు, పెద్దపెద్ద చెరువుల్లో పూడిక తీత పనుల తర్వాత.. పూడి ఇసుకను అమ్మకుండా.. నీటిపారుదల శాఖను నిరోధించారు. ఈ వ్యవహారంలో కూడా.. తగినంత సిద్ధంగా లేని ఏపీఎండీసీ కే ఈ పనులనూ అప్పగించారు. మొత్తం సరఫరా వ్యవస్థను ప్రభుత్వ యంత్రాంగమే అదుపు చేస్తోంది. పర్యవసానంగా, అకారణ జాప్యం జరుగుతోంది. ఇసుక తవ్వకాలను, రవాణా, సరఫరాలను పర్యవేక్షించేందుకు, సరిపడా సిబ్బంది లేకున్నా.. ఏపీఎండీసీ నే నోడల్ ఏజెన్సీగా నియమించారు. గతంలో ఇసుకను, తవ్వే చోటినుంచే.. ఉచితంగా సరఫరా చేసేవారు. ఇప్పుడు రూ.375 ప్రాథమిక ధరగా,ఇసుక తవ్వే చోటు నుంచి డిపోలకు, చివరి వినియోగదారుడికి.. కిలోమీటర్‌కు రూ.4.75 చొప్పున వసూలు చేస్తున్నారు.

ఈ విధానంలో దూరాన్ని బట్టి.. రవాణా ఖర్చు తడిసిమోపెడై.. ఇసుక ధర భారీగా పెరిగిపోతోంది. పర్యవసానంగా, ఇసుక బ్లాక్ మార్కెటింగ్ కి తలుపులు తెరిచినట్లయింది. వర్షాకాలం ముగిసిపోతోంది కాబట్టి.. రాష్ట్రంలోని మొత్తం 240 రీచ్‌లనూ వీలైనంత త్వరగా తెరవాలి. తవ్వకాలు, రవాణా, పంపిణీలను వికేంద్రీకరించాలి. తగినంత సామర్థ్యం, సిబ్బందీ లేని.. ఏపీఎండీసీ ద్వారా కేంద్రీకృతంగా కాకుండా.. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లకు ఈ పనులను అప్పగిస్తూ వికేంద్రీకరించాలి. యావత్తు రాష్ట్ర అవసరాలు-సరఫరాలను దృష్టిలో వుంచుకొని స్టాక్ యార్డుల సంఖ్యను పెంచాలి. ప్రస్తుతం మనకు రాష్ట్రంలో 240 ఇసుక రీచ్‌లున్నాయి. దాదాపు రెట్టింపు సంఖ్యలో.. ఎక్కడ వీలైతే అక్కడ.. స్టాక్ యార్డులను ప్రారంభించాలి. నిర్మాణ కార్యకలాపాలు పెద్దస్థాయిలో జరుగుతున్న అన్ని పట్టణాలు, నగర పంచాయతీ ప్రాంతాల్లో స్టాక్ యార్డులను తెరవాలి. నదీతీర ప్రాంతాల వెలుపలి పట్టా భూముల్లో.. తమ పట్టా భూముల్లోని ఇసుకను తొలగించేందుకు రైతులను అనుమతించాలి. అలాగే వాటిని వదిలించుకునేందుకూ అనుమతించాలి. గజిబిజి విధానంతో వినియోగదారులు గందరగోళ పడకుండా.. ఫారమ్‌లు, అనుమతుల సంఖ్యను తగ్గించి.. సడలించాలి. ఇసుక అవసరం ఉన్నవారు.. గ్రామ కార్యదర్శినో.. తహసీల్దారునో కలవాల్సిన అవసరం లేకుండా.. నేరుగా, ఆన్‌లైన్ విధానం ద్వారా కొనుగోలు చేసేందుకు అనుమతించాలి.

 

Similar News