నా పెళ్ళిళ్ళ వల్ల మీరు జైలుకు వెళ్ళారా?

Update: 2019-11-12 12:02 GMT

జగన్ పై జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ ఫైర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ‘నేను మూడు పెళ్ళిళ్లు చేసుకోవటం వల్ల జగన్ రెండేళ్లు జైలుకు వెళ్ళారా?. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు. మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటే సీఎం జగన్ మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. అయితే తాను టీడీపీ నేతల్లా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. జనసేన ప్రజాసమస్యలను లేవనెత్తుతుంటే భయపడే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక విధానంలో చేసిన తప్పుల వల్ల రాష్ట్రం ఎంత గందరగోళంలోకి వెళ్లిందో అందరూ చూశారని అన్నారు. అలాగే ఇంగ్లీషు భాష విషయంలో తొందరపాటు నిర్ణయం వల్ల విద్యార్ధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాము ఓ పార్టీగా స్పందించామన్నారు. టీచర్లు ఎప్పుడు ఇంగ్లీష్ లో శిక్షణ పొందుతారు..ఎప్పుడు పిల్లలకు చెబుతారు అని ప్రశ్నించారు.

ముందు ఓ పైలట్ ప్రాజెక్టుగా ఓ జిల్లాలోనో..కొన్ని ప్రాంతాల్లోనే అమలు చేసి పకడ్భందీగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదన్నారు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అన్న విషయంలో ఎవరికీ సందేహం లేదని..కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడకూడదనే తాము మాట్లాడుతున్నామని అన్నారు. వెంకయ్యనాయుడి హోదా గురించి కూడా గుర్తించకుండా ఆయనపై కూడా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. పది వేల లడీని జగన్ తనతో పాటు 151 మంది ఎమ్మెల్యేలకు చుడుతున్నారని వ్యాఖ్యానించారు. దీని వల్ల అందరూ ఇబ్బంది పడతారని గుర్తుంచుకోవాలన్నారు. అంత ప్రేమ ఉంటే సుప్రభాతం కూడా ఇంగ్లీష్ లోనే చదివించాలని ఎద్దేవా చేశారు. తాను ఏదైనా విమర్శలు చేస్తే వైసీపీలోని కాపు నేతలతో తిట్టిస్తున్నారని..మిగిలిన కులాల వారు తిట్టినా తాను ఏమీ అనుకోనని పవన్ వ్యాఖ్యానించారు.

కాపు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన తర్వాత కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ కాపులు ఓట్లు వేయలేదా? అని ప్రశ్నించారు. జగన్‌ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. తాము విధానాలపైనే మాట్లాడుతాం కాని వ్యక్తిగతంగా కాదన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సీఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని అన్నారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని పవన్‌ ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ ఎంతో చక్కగా పాలన అందించొచ్చని కానీ అలా చేయటం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలనే తాము ప్రశ్నిస్తున్నామని..తప్పులు ఉంటే సరి చేసుకోవాలన్నారు. హిందీని జాతీయ భాషగా చేస్తామనే ప్రకటనపై పలు రాష్ట్రాలు తీవ్రంగా స్పందించటంతో కేంద్రమే వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలు తీసుకుందని..అందులో తప్పేముందని ప్రశ్నించారు. సీఎంగా ఉన్న వ్యక్తి చిల్లరగా మాట్లాడటం సరికాదన్నారు.

 

Similar News