నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి?!

Update: 2019-11-07 04:54 GMT

ఫిబ్రవరి లేదా మేలో ప్రకటన ఉండే అవకాశం

తెలుగుదేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతుందా?. అంటే ఔననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఈ నియామకం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మేలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. ఎవరేమి చెప్పినా టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేతికి వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే టిక్కెట్ల ఖరారు వంటి విషయంలో మాత్రం చంద్రబాబు పెద్దగా జోక్యం చేసుకోనీయలేదనే చెప్పాలి. చివరకు నారా లోకేష్ టిక్కెటే చివరి నిమిషం వరకూ ఖరారు చేయలేదు. తాను పార్టీ వ్యవహారాలను చూస్తున్న తరుణంలోనే నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటం వల్ల ఉపయోగం ఉంటుందని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలవ్వటం ఆయన రాజకీయ కెరీర్ లో పెద్ద మైనస్ గా నిలవనుంది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ రాజకీయంగా మరింత క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. దానికి రంగం సిద్ధం చేసేందుకే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అని టీడీపీ నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. మరో వైపు గతంలో ఎన్నడూలేని రీతిలో టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం కావటం పార్టీకి రాజకీయంగా ఇది గడ్డుకాలంగానే మారింది. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా ఈ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అందులో అధికార వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న తరుణంలో టీడీపీ ఏ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన చాటుతుందనేది ఆసక్తికరమే.

అదే సమయంలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అధికార వైసీపీలో చేరే సూచనలు కన్పిస్తున్నాయి. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఓ వైపు బిజెపి, మరో వైపు వైసీపీ టీడీపీ నేతలు..క్యాడర్ ను టార్గెట్ చేసుకుని పావులు కదుపుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ నేతలు..క్యాడర్ ను వచ్చే నాలుగున్నర సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా కాపాడుకోవటమే ఇప్పుడు టీడీపీ ముందున్న పెద్ద సవాల్. పాత తరం నేతలను పక్కన పెట్టి కొత్తగా యువతరానికి పెద్ద పీట వేస్తానని టీడీపీ అధినేత ప్రతి చోటా చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకూ అమలు అవుతుందో వేచిచూడాల్సిందే.

 

 

 

Similar News