విజయ్ దేవరకొండ తొలిసారి ‘నిర్మాత’గా మారి తెరకెక్కించిన చిత్రమే ‘మీకు మాత్రమే చెప్తా’. టాలీవుడ్ సెన్సేషన్ హీరో, నిర్మాతగా మారి తీసిన సినిమా అంటే సహజంగానే ఓ క్రేజ్ ఉంటుంది. ఈ హీరో కమ్ నిర్మాత తీసిన సినిమాలో హీరోగా నటించింది మరో దర్శకుడు కావటం మరో విశేషం. ఆయనే తరుణ్ భాస్కర్. ‘మీకు మాత్రమే చెప్తా’ ఎవరికీ చెప్పొద్దు అనే మాట ఫ్రెండ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉండే అంశమే. అయినా అది అక్కడితో ఆగిపోతుందా?. నీకు మాత్రమే చెప్తా అన్నది కామన్ పాయింట్ అవుతుంది. విషయం మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ సినిమా స్టోరీ కూడా అదే. హీరో తరుణ్ భాస్కర్, ఆయన స్నేహితుడు అభినవ్ గోమటం అంతగా పాపులారిటీలేని ఓ ఛానల్ లో పనిచేస్తుంటారు. ఆ ఛానల్ రేటింగ్ ఎలా పెంచాలి అనే దానిపై యాజమాన్యం నుంచి ఒత్తిడి. అది అనుభవించే పాత్రలో తరుణ్ కన్పిస్తాడు. తరుణ్, అభినవ్ ల కామన్ ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఆడటానికి స్టేడియానికి చేరుకుంటారు. టీమ్ లో సభ్యుల సంఖ్య తక్కువ కావటంతో తరుణ్ తోపాటు అభినవ్ కు ఫోన్ చేస్తారు.
కానీ తరుణ్ భాస్కర్ అఫీషియల్ టూర్ కు వెళతాడు. అభినమ్ మాత్రం క్రికెట్ టీమ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ నుంచే కథ మొదలవుతుంది. తొలి ఐదు నిమిషాలు సినిమా చూసిన తర్వాత ఎక్కడో తేడా కొడుతుంది అనే భావన కలుగుతుంది. కానీ ఆ తర్వాత సినిమా కాస్త స్పీడ్ అందుకుంటుంది. సినిమా అంతా ఓ వీడియో చుట్టూనే తిరుగుతుంది. అది ఓ హానీమూన్ సీన్ తీసే దృశ్యం. అందులో తరుణ్, మరో యువతి కన్పిస్తారు. ఈ సీన్ తెరకెక్కించిన దర్శకుడు తన ఫోన్ రిపేర్ కి ఇచ్చినప్పుడు షాప్ అతను ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాడు. ఈ లోగా తరుణ్ ఓ డాక్టర్ ను ప్రేమించి పెళ్ళికి సిద్ధమవుతాడు. ఈ సమయంలో ఈ వీడియో వెలుగులోకి వస్తుంది.
అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది..దాన్ని డిలీట్ చేయటానికి పడే కష్టాలే ఈ సినిమా అంతా. ఫస్టాఫ్ అంతా తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం కామెడీతో సినిమా వేగంగా పూర్తి అవుతుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం ఆ వేగం కన్పించదు. కేవలం యూత్ ను టార్గెట్ చేసుకునే ఈ సినిమా తెరకెక్కించినట్లు స్పష్టం అవుతుంది. అయితే క్లైమాక్స్ లో మాత్రం ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వాణిభోజన్ పాత్ర చాలా పరిమితమే. అనసూయ పాత్ర కూడా చిన్నదే అయినా..ఉన్నంతలో కీలక పాత్రగానే చెప్పుకోవాలి. సినిమా మొత్తం తరుణ్, అభినవ్ పాత్రలే కన్పిస్తాయి. వీళ్లిద్దరి యాక్షనే సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా చూస్తే ‘మీకు మాత్రమే చెప్తా’ ఓ సరదా సినిమా.
రేటింగ్. 2.75/5