నదుల నుంచి ఇసుక తీసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు ప్రభుత్వం ‘పాలసీ’ అంటూ నో చెప్పింది. మేం పాలసీ సిద్ధం చేసేంత వరకూ ఎవరూ ఇసుక తీసుకోవటానికి వీల్లేదంటూ ఆపేసింది. విధానం ఖరారుకే వైసీసీ సర్కారు నెలల తరబడి సమయం తీసుకుంది. చివరకు విధానం తీసుకొచ్చాక నదులను ఇసుక తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో గతంలో ఎన్నడూలేని రీతిలో ఏపీలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి..ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడింది. కార్మికులది ఓ సమస్య అయితే ఏపీలో ఇళ్ళు కట్టుకోవాల్సిన వారు...ఇతర వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవాల్సిన వాళ్ళు ఇసుక లేక పనులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎప్పుడూ ఈ విచిత్ర పరిస్థితి లేదనే చెప్పొచ్చు. ఇసుక సమస్యను ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, బిజెపిలు టేకప్ చేశాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’తో ఏపీలో రాజకీయ వేడి పెరిగిందనే చెప్పాలి. ఈ లాంగ్ మార్చ్ కు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ బహిరంగంగా మద్దతు ప్రకటించటంతోపాటు తమ పార్టీ కీలక నేతలు ఇందులో పాల్గొంటారని ప్రకటించింది.
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు సంఘీభావం ప్రకటించారు. వామపక్షాలు మాత్రం బిజెపిని పిలిచారు కాబట్టి తాము ఇందులో పాల్గొనబోమని ప్రకటించాయి. అయితే అధికార వైసీపీ మాత్రం జనసేనను టార్గెట్ చేసింది. ఒకేరోజు ఏకంగా ముగ్గురు మంత్రులు..వైసీపీ నేతలు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, మంత్రి కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ లు జనసేన లాంగ్ మార్చ్ పై విమర్శలు చేస్తూ విలేకరుల సమావేశం పెట్టారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ జనసేన సమావేశంపై ఎంత ఫోకస్ పెట్టిందో అర్ధం అవుతుంది. పలువురు మంత్రులు ఇసుక సమస్య ఉందని అంగీకరిస్తూనే రాజకీయ విమర్శలు చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వైజాగ్ లో తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోందనే చెప్పాలి.