జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై విమర్శల జోరు కొనసాగిస్తున్నారు. ఆయన శుక్రవారం నాడు పలు అంశాలపై స్పందించారు. అమరావతి నిర్మాణాలు ఆపటమే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు పెద్ద శాపంగా మారిందని అన్నారు. గతంలో వైసీపీ కూడా అసెంబ్లీలో రాజధాని అమరావతికి సంబంధించిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది కదా? మరి ఇఫ్పుడు పనులు ఎందుకు ఆపారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై, చంద్రబాబుపై కోపం ఉంటే రాజధాని పనులు ఆపేస్తారా? అని ప్రశ్నించారు. 30 వేల ఎకరాల్లో వద్దనుకుంటే ఐదు వేల ఎకరాల్లో రాజధాని పనులు ప్రారంభించాలని..రాజధాని ఎక్కడ వస్తుందో కనీసం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పులివెందులో పెట్టుకున్నా అభ్యంతరం లేదని..అయితే ప్రజాభిప్రాయం తీసుకోండని వ్యాఖ్యానించారు. ‘గతంలో 1200 మంది చనిపోయారు అని లెక్కలు వేసి ఒదార్పు యాత్ర పేరుతో అందరి ఇళ్లకు వెళ్లారు. 50 మంది చనిపోయారు అని భవన నిర్మాణ కార్మికులు చెబుతుంటే మాత్రం వినడం లేదు. ఓటుకు రెండు వేలు ఇస్తారు గానీ పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు 5 లక్షల పరిహారం ఇవ్వమంటే ఇవ్వడం లేదు.
ప్రభుత్వ సొమ్ము అడిగినా మీకు మనసురాదు. ఎందుకు మనసొప్పడం లేదో స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పగలరా? మేమేం భారతీ సిమెంట్స్ ఖాతాల నుంచి, మీ సొంత జేబుల నుంచి అడగడం లేదు. మేం కడుతున్న పన్నుల నుంచి అడుగుతున్నాం. పని లేని కాలానికి ఒక్కో కార్మికుడికి రూ. 10 వేలు ఇవ్వమని అడుగుతున్నాం. చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం అడుగుతున్నాం.’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డొక్కా సీతమ్మ పేరుతో ఏపీలో ఏర్పాటు చేసిన ఆహార శిబిరాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని రాజకీయాలు చేయడానికి తాము రాలేదని, మా సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారిని తీసుకుంటున్నాం. అవకాశవాదంతో వచ్చిన వారు వెళ్లిపోయారు. ఒత్తిడిని తీసుకోలేని వారు రాజకీయాల్లో కొనసాగలేరని వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఆహార శిబిరాల సాక్షిగా చెబుతున్నా భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల వారికి ఒకటే మాటిస్తున్నాం మీ పోరాటమే.. మా పోరాటం" అని అన్నారు.
లాంగ్ మార్చ్ కు రెండు లక్షల మంది వస్తే అందులో అభిమానులు, జనసైనికులు కలిపి వచ్చింది 60 వేల మందే. మిగిలిన వారంతా భవన నిర్మాణ కార్మికులు, వారికి మద్దతుగా వచ్చిన ప్రజలే అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్ధమవుతుందన్నారు. ‘నాకు ఎవరి పైనా వ్యక్తిగత ద్వేషాలు, శత్రుత్వం లేవు. ప్రజా సమస్యల వ్యవహారంలో మాత్రం ఎవరితో అయినా శత్రుత్వం పెట్టుకోవడానికి సిద్ధం. నాకు జగన్ రెడ్డి మీద, చంద్రబాబు మీద ఎటువంటి ద్వేషం లేదు. వారి విధానాలు ప్రజల్ని చంపేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. సగటు మనిషి బతికేందుకు అవసరమైన సామాజిక పరిస్థితులు కల్పించాలన్న కాంక్షతోనే జనసేన పార్టీని స్థాపించాం. రెండున్నర గంటల సినిమాలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. వాస్తవంలో అది కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్నో కష్టాలు సైతం అనుభవించాల్సి వస్తుంది. సగటు మనిషికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. మీకు గొంతుకనవ్వాలని, మీకు బలమవ్వాలన్నదే నా లక్ష్యం. మీకు ఏ కష్టం వచ్చినా అది నా గొంతులో ధ్వనిస్తుంది. లక్షలాది మంది రోడ్డున పడి, 50 మంది చనిపోతేగానీ వైసీపీ వారు ఇసుక వారోత్సవాలు చేయరా? మీ విధానాల కారణంగా లక్షలాది మంది పస్తులుంటున్నారు. అసలు పస్తులంటే మీకు తెలుసా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు.
పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "డొక్కా సీతమ్మ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే జనసేన పార్టీ ఆహార శిబిరాలు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దాదాపు 150కి పైగా నియోజకవర్గాల్లో జనసేన నాయకులు ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడటానికి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్తకు ధన్యవాదాలు. ఇకముందు కూడా జనసైనికులు, నాయకులు రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడం కోసం నిలబడాల"ని పిలుపునిచ్చారు.