పవన్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-11-11 07:32 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ జగన్ మరోసారి పవన్ కళ్యాణ్ భార్యల అంశాన్ని ప్రస్తావించారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు..నలుగురో...ఐదుగురో పిల్లలు. వాళ్ళు ఏ మీడియంలో చదువుతున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలి. అలాగే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులు కూడా తెలుగు భాషపై మాట్లాడారు. మీ పిల్లలు..మీ మనవళ్ళు ఏ మీడియం పాఠశాలల్లో చదువుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలోని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్లు జగన్ సర్కారు ప్రకటించిన తర్వాత వీరంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీటికి సమాధానంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదకపోతే వారి భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారు. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని జగన్ వ్యాఖ్యానించారు.

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33శాతం. దేశంలో 27శాతం ఉంది. దేశ సరాసరి కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఈ దారిద్యం పోవాలి అంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించాలి. ఒక దీపం గదికి వెలుగునిస్తే.. చదువుల దీపం కుటుంబానికి, దేశానికి వెలుగునిస్తుంది. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలి. అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల ఓ జీవోను విడుదల కూడా చేసింది. కార్యాచరణ కూడా రూపొందించిందని తెలిపారు. పిల్లలకు మంచి చదవులు ఇ‍వ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పిల్లలకి ఉన్నత చదవులు అందించాలని అనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.

దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణం. తొలుత నాడు నేడు కార్యక్రమంలో 15వేల పాఠశాలలను ఆధునీకరిస్తాం. ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తాం. అన్ని వసతులను కల్పిస్తాం. వాటిల్లో ఇంగ్లీషు ల్యాబులు కూడా ఏర్పాటు చేస్తాం. ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తూనే.. తొలుత 1 నుంచి 6 తరగతి వరకు అమలు చేస్తాం. ఆ తరువాత ఒక్కో తరగతి పెంచుతూ పోతాం. పాఠశాలతో విద్యతో ప్రారంభమైన ఈ విప్లవాత్మక మార్పులు.. ఉన్నత విద్యలోనూ అమలు చేస్తాం. చదువే మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి. మదార్సా పాఠశాలల గురించి మంత్రులు నాకు ఇదివరకే గుర్తుచేశారు. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా మదార్సా బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే అమలు చేస్తాంఅని తెలిపారు.

Similar News