ఏపీలోని అధికార వ్యవస్థలో పోరు కొత్త మలుపు తిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నవంబర్ 1నే సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు మెమో జారీ చేశారు. వారం రోజుల్లో ఈ ఉల్లంఘనలకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. తీరా చూస్తే ఏకంగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పోస్టే పోయింది. ఆయన్ను సీఎస్ పదవి నుంచి తప్పించి బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరక్టర్ జనరల్ గా నియమించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసింది కూడా ప్రవీణ్ ప్రకాషే కావటం విశేషం. ఈ వ్యవహారంపై ఐఏఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘మీరు ఐఏఎస్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారు. దీనికి సమాధానం ఇవ్వండి అని వివరణ అడిగితే..అలా అడిగిన వ్యక్తినే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఆ పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం’ ఓ వింతగా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మరి ఇఫ్పుడు ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదా?. ఎల్వీ ప్రస్తావించిన తప్పులు ఒప్పులు అయిపోతాయా? అన్న చర్చ జరుగుతోంది. తాజా చర్యల ద్వారా ప్రభుత్వం తమకు నియమ, నిబంధనల కంటే తాము అనుకున్న పని ..తమకు నచ్చినట్లు చేయటమే ముఖ్యం అన్న సంకేతాలు స్పష్టంగా పంపినట్లు అయిందని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఇది పరిపాలనపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికైన ప్రభుత్వానికి ఏ విధాన నిర్ణయం అయినా తీసుకునే అధికారం..హక్కులు ఉన్నా కూడా అవి అమల్లో ఉన్న నియమ, నిబంధనలు అనుసరించే సాగాలి తప్ప..అందుకు భిన్నంగా అంతా మా ఇష్టం అన్న రీతిలో వెళ్ళటం సరికాదని కొంత మంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంత మంది అధికారులు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరును కూడా తప్పుపడుతున్నారు. నిబంధనలను పాటించకుండా ప్రవీణ్ ప్రకాష్ కొన్ని ఫైళ్లను మంత్రివర్గం ముందు పెట్టి ఉండొచ్చు. వాటిని మంత్రివర్గం ఆమోదించిన తర్వాత వివాదం చేయటం సరికాదని..ఏదైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఏకంగా సీఎంవోలో ఉన్న అధికారికి మెమో జారీ చేసి...వివరణ అడగటం అంటే ఓ రకంగా సీఎం నిర్ణయాలను ధిక్కరించినట్లే అవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు పలు నియామకాలకు సంబంధించి కూడా సీఎం, సీఎస్ ల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సీఎస్ పై వేటు వ్యవహారం ఏపీ అదికార వర్గాలను ఓ కుదుపు కుదిపేసినట్లు అయింది. సీఎం ఆదేశాలతోనే సీఎస్ బదిలీ జరిగినా ..ఆ ఉత్తర్వులు జారీ చేసింది ప్రవీణ్ ప్రకాష్ కావటమే ఓ వింత.