అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టుకు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అంతకు ముందుకు హాజరైనట్లు ప్రతి శుక్రవారం జగన్ ఇప్పుడు సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నందున పని ఒత్తిడి ఉంటుందని..దీనికి తోడు వారం వారం కోర్టుకు రావటం వల్ల ఖజానాపై భారం పడుతుందని జగన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే సీబీఐ మాత్రం జగన్ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని..గతంలోకి ఇఫ్పటికే కేసులో ఎలాంటి మార్పులేదని..జగన్ కు సీఎం హోదా రావటం తప్ప ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని పేర్కొంది.
ఈ అంశంపై ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు శుక్రవారం నాడు జగన్ పిటీషన్ ను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. సీబీఐ తన కౌంటర్ లో జగన్ సీఎంగా ఉన్నందున కేసును మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. వాస్తవానికి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఇఫ్పటికే సీబీఐ అన్ని విచారణలు పూర్తి చేసి ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. సీబీఐ ఛార్జిషీట్లనే ఈడీ కూడా పరిగణనలోకి తీసుకుని చర్యలు ప్రారంభించింది.
రాజకీయంగా ఇరకాటం
సీబీఐ కోర్టు ఆదేశాలు రాజకీయంగా వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి సృష్టించనుంది. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అదే వారం వారం కోర్టుకు హాజరైతే దీనిపై మరింత విమర్శలు చేయటం ఖాయంగా కన్పిస్తోంది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎధుర్కొంటున్న జగన్ తన హాజరుకు అయ్యే ఖర్చును సొంత ఖర్చుల నుంచే భరించాలని..జగన్ కేసులకు ప్రభుత్వ సొమ్ము ఎలా వాడతారంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జగన్ పిటీషన్ వేసిన సమయంలో విమర్శలు చేశారు. ఏది ఏమైనా సీబీఐ కోర్టు తీర్పు జగన్ ను రాజకీయంగా ఒకింత ఇబ్బందుల్లోకి నెట్టే అంశమే.